Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharashtra CM) పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గురువారం ఢిల్లీలో ఎన్డీయే అగ్రనేతలతో మహాయుతి (Mahayuti) నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగినట్లు భేటీ అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తెలిపారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించినున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం ముంబైలో జరగాల్సిన మీటింగ్ అనూహ్యంగా రద్దైంది. అందుకు కారణం షిండే.. ఉన్నఫలంగా తన సొంత గ్రామం సతారాకు వెళ్లడమే.
అమిత్ షాతో సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత షిండే తన నిర్ణయాన్ని మార్చుకున్నారని, అధిష్ఠానం ప్రతిపాదించిన కూటమి ఫార్ములా ఆయనకు నచ్చలేదని ప్రచారం జరుగుతున్నది. ముందుగా ఎలాంటి షెడ్యూల్ లేకుండా ఆయన సొంత గ్రామానికి వెళ్లడం పలు అనుమానాలకు దారి తీసింది. ఊహించని ఈ పరిణామంతో అధిష్ఠానం నిర్ణయంతో ఆయన ఏమాత్రం సంతోషంగా లేరని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారాన్ని శివసేన (Shiv Sena) తోసిపుచ్చింది. అధిష్ఠానం నిర్ణయంపై షిండే కలత చెందలేదని.. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక అస్వస్థతకు గురయ్యారని స్పష్టతనిచ్చింది. అందుకే తన స్వగ్రామం సతారా వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. నిన్న రద్దైన సమావేశం నేడు (శనివారం) జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ‘అధిష్ఠానం నిర్ణయంతో షిండే కలత చెందలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. మనస్తాపం చెందే సొంతగ్రామం వెళ్లాడని చెప్పడం సరికాదు’ అని శివసేన నేత, ప్రస్తుతం ఐటీ మంత్రిగా ఉన్న ఉదయ్ సామంత్ వివరణ ఇచ్చారు.
Also Read..
Massive Fire | వారణాసి రైల్వే స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. 200 బైక్‌లు దగ్ధం
Josh Hazlewood: రెండో టెస్టుకు జోష్ హేజిల్‌వుడ్ దూరం
Tiger | టైగర్ టెన్షన్.. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆ గ్రామాల్లో 144 సెక్షన్