ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, శివసేనలో తిరుగుబాటుకు ముందు మాతోశ్రీలో ఏడ్చారని (Cried At Matoshree) ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే దర్యాప్తు సంస్థలు తనను జైలులో పెడతాయన్న భయంతో ఆయన ఏడ్చినట్లు తెలిపారు. ‘మాతోశ్రీకి వచ్చిన తర్వాత ఏక్నాథ్ షిండే ఏడ్చారు. బీజేపీతో వెళ్లకపోతే, వారితో చేతులు కలపకపోతే తనను జైలులో పెడతారని చెప్పారు’ అని ఆదిత్య ఠాక్రే ఈ నెల 11న అన్నారు. అయితే ఆదిత్య ఠాక్రే చేసిన ఈ వ్యాఖ్యలను శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూడా ధృవీకరించారు. ఇది నిజమేనని అన్నారు.
జైలు శిక్ష పడుతుందనే భయం ఏక్నాథ్ షిండే మనసులో, హృదయంలో స్పష్టంగా కనిపించిందని సంజయ్ రౌత్ తెలిపారు. ‘ఇది వంద శాతం కరెక్ట్. నా వద్దకు వచ్చిన తర్వాత కూడా ఏక్నాథ్ షిండే ఈ మాట చెప్పారు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పేందుకు నేను ప్రయత్నించాను. కానీ ఆయన మనసులో, హృదయంలో జైలు భయం స్పష్టంగా కనిపించింది. ఆదిత్య ఠాక్రే చెప్పింది నిజమే’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. అలాగే మీడియాకు కూడా ఇదే విషయాన్ని ఆయన తెలిపారు. తనను జైలులో పెడతారన్న భయం ఏక్నాథ్ షిండేకు ఉందని, అందుకే ఎంవీఏ కూటమిని వీడాలని తనతో కూడా అన్నట్లు చెప్పారు.
కాగా, ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ స్పందించారు. అబద్ధం ఎలా చెప్పాలో నేర్పే ప్రొఫెషనల్ టీమ్ ఆదిత్య వద్ద ఉందని విమర్శించారు. రాజకీయాల్లో ఇలాగే జరుగుతుందని అన్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే మాతోశ్రీని ఎప్పుడు సందర్శించారు, ఏ సంవత్సరంలో ఆయన ఏడ్చారో వెల్లడించాలని బీజేపీ నేత నారాయణ్ రాణే ప్రశ్నించారు. ఆదిత్య ఠాక్రేలో చిన్నతనం పోలేదని అన్నారు. ఇదంతా నాన్సెన్స్ అని కొట్టిపారేశారు.
Also Read: