Two Buses Collide | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి (Two Buses Collide). ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తెన్కాసి (Tenkasi) జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై నుంచి సెంకోట్టైకు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, తెన్కాసి నుంచి కోవిల్పట్టి వైపు వెళ్తున్న మరో బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సుమారు 28 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధురై నుంచి సెంకోట్టైకు వెళ్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Also Read..
Delhi Pollution | ఢిల్లీ పోలీసులపై పెప్పర్ స్ప్రే.. 22 మంది అరెస్ట్
Census 2027 | 2027 జనాభా గణనకు సిద్ధం..! మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఇవే..!
Operation Crystal Fortress | ఢిల్లీలో కలకలం.. ఓ ఇంట్లో రూ.262 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం