TMC : పశ్చిమ బెంగాల్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి, సీఎం మమతా బెనర్జీ (టీఎంసీ)కి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ జరిపిన దాడుల్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారు. ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి మరీ.. కొన్ని డాక్యుమెంట్లను తనతో తీసుకెళ్లారు. దీంతో మమత చర్యకు వ్యతిరేకంగా ఈడీ.. కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది.
మమత బెనర్జీ కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లి, నేరానికి పాల్పడ్డారని ఆరోపించింది. అయితే, ఈడీ ఆరోపణలను ఖండిస్తూ మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ, ఐ-ప్యాక్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. తమ డాక్యుమెంట్లను ఈడీ అక్రమంగా తీసుకెళ్లిందని, తమ పార్టీకి సంబంధించిన అంతర్గత వివరాల్ని సేకరించాలనుకుందని టీఎంసీ ఆరోపించింది. తమ ప్రైవసీకి భంగం కలిగించాలని ఈడీ ప్రయత్నించిందని కోర్టుకు తెలిపింది. తమ వద్ద సేకరించిన డాటాను భద్రంగా ఉంచేలా ఆదేశించాలని కోరింది. తమ పార్టీ వివరాల్ని, ప్రణాళికల్ని బయటపెట్టాలని చూడటం సరికాదని తెలిపింది. అయితే, ఈ ఆరోపణల్ని ఈడీ కొట్టిపారేసింది.
తాము ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లలేదని కోర్టుకు తెలిపింది. తమ చర్యల వల్ల టీఎంసీకి ఎలాంటి నష్టం లేదని కోర్టుకు తెలిపింది. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ సువ్ర ఘోష్.. ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా టీఎంసీ పిటిషన్లను కొట్టివేశారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని సూచించారు.