ఫెమా కేసులో 5,551 కోట్లు జప్తు
విదేశీ కంపెనీలకు నిధుల అక్రమ బదిలీ ఆరోపణలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: చైనాకి చెందిన దిగ్గజ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీకి గట్టి షాక్ తగిలింది. విదేశీ మారక చట్టం(ఎఫ్ఈఎంఏ) ఉల్లంఘన కేసులో షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన రూ.5,551 కోట్ల బ్యాంకు డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఫెమా చట్టంలోని పలు నిబంధనల కింద జప్తు చేపట్టినట్టు ఈడీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. షావోమీ కంపెనీ ‘ఎంఐ’ బ్రాండ్ పేరుతో మన దేశంలో మొబైల్ ఫోన్ల వ్యాపారం చేస్తున్నది. చైనా సంస్థ షావోమీ గ్రూపునకు అనుబంధంగా ఉన్న షావోమీ ఇండియా 2014 నుంచి భారత్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఆ తరువాతి ఏడాది నుంచి షావోమీ ఇండియా రూ.5,551.27 కోట్ల నిధులను అక్రమంగా విదేశీ కంపెనీలకు బదిలీ చేసిందన్న ఆరోపణలపై ఈడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
సేవలు పొందకుండానే డబ్బు బదిలీ
రాయల్టీ రూపంలో షావోమీ గ్రూపుతో పాటు ఎటువంటి సంబంధం లేని అమెరికాలోని మరో రెండు విదేశీ కంపెనీలకు ఈ డబ్బంతా బదలాయించినట్టు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొన్నది. భారత్‌లోని తయారీదారుల నుంచే మొబైల్ సెట్లు, ఇతర ప్రోడక్టులు కొనుగోలు చేసే షావోమీ ఇండియా.. పైన పేర్కొన్న సదరు మూడు కంపెనీల నుంచి ఎటువంటి సేవలు పొందకుండానే డబ్బులు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసిందని, మాతృసంస్థ షావోమీ గ్రూపు ఆదేశాలతోనే ఈ వ్యవహారమం తా జరిగిందని ఈడీ వివరించింది. ఈ కేసు విచారణలో ఈడీ ఇటీవల షావోమీ గ్రూప్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్‌ను ప్రశ్నించింది.