Congress MLA | కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సెయిల్‌పై మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. కార్వార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సతీశ్ కృష్ణ.. మల్లికార్జున్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 నిబంధనల కింద ఈడీ కంపెనీపై సైతం ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.44.09 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో ఎమ్మెల్యే సతీశ్ కృష్ణకు చెందిన రూ.21 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఈ కేసులో సతీష్ కృష్ణను సెప్టెంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది. ఆ వైద్య కారణాలతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈడీ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు రద్దు బెయిల్‌ను రద్దు చేసింది. 2010లో కర్నాటక లోకాయుక్త దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసును విచారిస్తున్నది. బళ్లారి నుంచి బెలెకేరి ఓడరేవుకు దాదాపు 8లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అదే సమయంలో ఈడీ మరో కేసులో ఓషన్ సెవెన్ బిల్డ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (OSBPL) మేనేజింగ్ డైరెక్టర్ స్వరాజ్ సింగ్ యాదవ్‌ను అరెస్టు చేసింది. స్వరాజ్ సింగ్ యాదవ్ మనీలాండరింగ్, పలు ప్రాజెక్టులలో గృహ కొనుగోలుదారుల నుంచి సేకరించిన నిధుల దుర్వినియోగంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. పీఎంఎల్ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఢిల్లీ ఎన్సీఆర్, ఇతర ప్రదేశాల్లో సోదాల తర్వాత యాదవ్‌ను అరెస్టు చేసినట్లు ఈడీ పేర్కొంది.