Election Commission | మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. రెండు రాష్ట్రాల్లో నూ రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో ఆయా పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన అభ్యంతరకర ప్రకటనలపై ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. రెండు పార్టీల జాతీయ అధ్యక్షులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై సమాధానం ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈసీ లేఖ రాసింది.
బీజేపీ చేసిన ఫిర్యాదుపై స్పందించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందన కోరింది. ఈ నెల 18 మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమాధానం ఇవ్వాలని సూచించింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జారీ చేసిన సూచనలు పాటించాలని రెండు పార్టీలకు సూచించింది. ఇందులో స్టార్ క్యాంపెయినర్స్, నేతలపై నియంత్రణ ఉండాలని చెప్పింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా విభజన అంశంపై చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 14న కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని.. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలందరిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ కోరింది.
8న మహారాష్ట్రలోని నాసిక్, ధులేలలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్, మిత్రపక్షాలపై చేసిన వ్యాఖ్యలను అసంబద్ధ ఆరోపణలు చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై ఆరోపణలు చేశారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నవంబర్ 11న ఫిర్యాదు చేసింది. రెండురాష్ట్రాల్లో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందని అబద్ధాలు అబద్ధాలు చెప్పారని.. రాహుల్‌కి అది అలవాటేనన్నారు. హెచ్చరించినా.. నోటీసులు ఇచ్చినా ఆయన తన వ్యాఖ్యలు మానుకోవడం లేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. బీఎన్ఎస్ సెక్షన్ 353 కింద రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశామని మేఘవాల్ పేర్కొన్నారు.