Rahul Gandhi | న్యూఢిల్లీ, ఆగస్టు 1: బీహార్ ఓటర్ల లిస్టుకు సంబంధించి పార్లమెంట్లో తీవ్ర రగడ జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కోసం ఓట్ల చోరీకి పాల్పడిన ఎన్నికల సంఘం బండారాన్ని బయటపెట్టే ‘అణు బాంబు’ కాంగ్రెస్ వద్ద ఉందని ఆయన శుక్రవారం పేర్కొన్నారు. ఆ అణుబాంబుతో ఎన్నికల సంఘాన్ని పేల్చినప్పుడు దానికి ఈ ప్రపంచంలో దాక్కోవడానికి ఎక్కడా చోటు దొరకదని అన్నారు.
ఈ రాజద్రోహంలో పాలుపంచుకున్న ఎవరినీ వదలమన్న విషయాన్ని ఎన్నికల సంఘం లోని దిగువ స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు అర్థం చేసుకోవాలని అన్నారు. బీహార్ ఓటర్ల లిస్టుల ముసాయిదాను ఎన్నికల సంఘం ప్రకటించిన క్రమంలో రాహుల్ ఈ ప్రకటన చేశారు. కాగా, రాహుల్ చేసే ఆరోపణలు నిరాధారమని ఎన్నికల సంఘం ఖండించింది.