FASTAG | న్యూఢిల్లీ, జూలై 18: ఉద్దేశపూర్వకంగా తమ వాహనాల ముందు భాగంలోని విండ్ షీల్డ్(అద్దం)కు ఫాస్టాగ్‌ను అతికించని వారి నుంచి రెట్టింపు టోల్ చార్జీలు వసూలు చేయాలని భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) గురువారం ఆదేశించింది. విండ్ షీల్డ్‌కు ఫాస్టాగ్ అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద ఇతర వాహనదారులకు అనవసర జాప్యం జరుగుతున్నదని తెలిపింది. తాజా ఆదేశాలను అన్ని టోల్ ప్లాజాల వద్ద ప్రదర్శిస్తామని చెప్పింది.
ఫాస్టాగ్ అతికించని వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్ల సీసీటీవీ ఫుటేజీని రికార్డు చేస్తామని వెల్లడించింది. ప్రామాణిక నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ కలిగి ఉండి దాన్ని ప్రదర్శించని వాహనాలకు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ లావాదేవీలు నిర్వహించరని.. అలాంటి వాహనాల నుంచి రెట్టింపు టోల్ చార్జీ వసూలు చేయడంతో పాటు వాటిని బ్లాక్ లిస్టులో ఉంచొచ్చని తెలిపింది. విండ్‌షీల్డ్‌కు ఫాస్టాగ్‌ను అతికించుకొన్నారా లేదా అనే విషయాన్ని వాటిని జారీ చేసే బ్యాంకులు కూడా పరిశీలించాలని ఎన్హెచ్ఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది.