Akhilesh | డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటే యూపీలో డబుల్ కరప్షన్‌కు దారి తీసిందని సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుతం యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారధ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ ప్రచారం చేస్తున్నది. ఈ నేపథ్యంలో గురువారం బిజ్నోర్‌లో జరిగిన భారీ సభలో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్ సింగ్ చౌదరితో కలిసి అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోదీ ఏ రాజ్యాంగాన్ని తీసుకొస్తారో ఎవరికి తెలుసని అఖిలేశ్ అన్నారు. యూపీ ఎన్నికల తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ఏమైనా చేస్తుందన్నారు. కనుక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని నిలువరించడం అత్యవసరం అని అన్నారు. చిన్న నేతలు చిన్న అబద్దాలు.. పెద్ద నేతలు పెద్ద అబద్దాలాడుతున్నారని బీజేపీపై ధ్వజమెత్తారు.
అవినీతి అంతానికే పాత పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు అప్పట్లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పారని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. కానీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో గ్రోత్ అంటే డబుల్ డబుల్ కరప్షన్గా మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఒకరి చక్రాలు మరొకరు తొలగించుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. యూపీలో ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తున్నదన్నారు. కనుక వచ్చే నెల 10 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటయ్యే సర్కార్ తమదేనన్నారు.