Congress | న్యూఢిల్లీ : గుజరాత్ కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని, అవసరమైతే 20, 30 మంది నాయకులను ఏరిపారేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలకు విధేయతా పరీక్షను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. తమ శరీరంలో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సత్కరిస్తామని, అమ్ముడుపోయిన నాయకులను పార్టీ నుంచి బయటకు పంపిస్తామని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెల్లడించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలలో డీఎన్ఏ చూడాలని రాహుల్ చెప్పారని, కాంగ్రెస్ పార్టీలో అటువంటి వ్యక్తులు 30 శాతం మంది ఉన్నారని, రాజస్థాన్‌లో నాయకులందరికీ డీఎన్ఏ టెస్టు చేస్తామని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్చార్జ్ సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. అయితే ఈ టెస్టును ఎలా నిర్వహిస్తారో ఆయన చెప్పలేదు. సమావేశానికి గైర్హాజరైన వారి పేర్లు జాబితాలో ఎక్కుతాయని, వాటిని పీసీసీకి పంపుతామని ఆయన తెలిపారు.