న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాల ప్రభావం భారతదేశ ఎగుమతులపై ఏ రకంగా ఉంటుందన్న విషయమై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, త్వరలోనే అమెరికాతో ఖరారయ్యే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కింద పన్ను తగ్గింపులతో సహా తీసుకోవాల్సిన అన్ని చర్యలను పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. భారతీయ వస్తువులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలపై ప్రభుత్వం సవివరంగా సమీక్ష జరుపుతోందని, ఎగుమతుదారులను పరిరక్షించి ఎగుమతులు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని వారు చెప్పారు.
ఇతర దేశాల తరహాలో భారత్‌పై సుంకాల ప్రభావం లేదని వారు తెలిపారు. కొత్త వాణిజ్య బంధాలను ఏర్పరుచుకునేందుకు ఇప్పటికే భారత అధికారులు కొన్ని దేశాలతో చర్చలు ప్రారంభించారని వారు చెప్పారు. అయితే అమెరికా సుంకాలను ఎదుర్కొంటున్న దేశాల నుంచి అదనంగా సరుకులు భారతీయ మార్కెట్లలోకి వచ్చి పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.