Dimple Yadav : యూపీ రాజధాని లక్నోలో వరద నీటిలో బైక్‌పై వెళుతున్న మహిళను పోకిరీలు వేధించిన ఘటనపై ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ స్పందించారు. యూపీలో మహిళలపై పెచ్చుమీరిన ఆగడాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన డింపుల్ యాదవ్ నిందితులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళను వేధిస్తున్న వీడియోలు, రికార్డింగ్‌లు వెలుగుచూశాయని, ఈ పని ఎవరు చేశారనేది ప్రభుత్వం సులభంగా గుర్తించవచ్చని ఆమె పేర్కొన్నారు.
మహిళలను వేధించేవారిపై కొరడా ఝళిపించేందుకు కాషాయ పాలకులు ఆర్భాటంగా స్క్వాడ్లు ఏర్పాటు చేశారని, కానీ ఇప్పుడు వాటిని కోల్డ్ స్టోరేజ్‌కు పరిమితం చేశారని డింపుల్ యాదవ్ మండిపడ్డారు. యూపీ ప్రభుత్వం తక్షణమే మహిళల కోసం ఉద్దేశించిన 1090 సర్వీస్‌ను పునరుద్ధరించాలని డింపుల్ యాదవ్ డిమాండ్ చేశారు. కాగా, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో పోకిరీల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది.
రాజధాని లక్నో (Lucknow)లో బైక్‌పై వెళ్తున్న ఓ మహిళపై అల్లరిమూక వేధింపులకు (Harassing Woman) తెగబడింది. భారీ వర్షాల కారణంగా వరద నీటితో నిండిన రోడ్డు (Flooded Road)పై బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.ఓ మహిళ స్థానిక తాజ్ హోటల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వర్షపు నీటిలోంచి ఒక వ్యక్తితో కలిసి బైక్‌పై వెనుక కూర్చొని వెళ్తోంది.
అప్పటికే నీళ్లలో దిగి వెకిలి చేష్టలు చేస్తున్న దాదాపు 15 మంది యువకులు.. మహిళను చూసి వర్షపు నీళ్లు చల్లడం మొదలు పెట్టారు. ఆమెను వేధిస్తూ వికృతానందం పొందారు. అనంతరం ఆమెను ఒక్కసారిగా నీటిలోకి పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అల్లరి మూకను చెదరగొట్టారు. అనంతరం ఆ మహిళను అక్కడి నుంచి పంపించేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Read More :
Thangalaan | తుఫాను వచ్చేస్తుంది.. విక్రమ్ తంగలాన్ అడ్వెంచరస్ రైడ్‌కు రెడీనా..?