Digitally arrest : డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మారడం లేదు. తాజాగా ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కారణంగా రూ.15 కోట్ల వరకు మోసపోయింది. రెండు వారాలపాటు సైబర్ నేరగాళ్లు ఈ ఎన్ఆర్ఐ జంటను మోసం చేశారు. దీనిపై బాధిత జంట తాజాగా పోలీసులకు ఫిర్యాదుచేసింది. అమెరికాలో డాక్టర్లుగా పని చేసి రిటైరైన డా.ఓం తనేజా, అతడి భార్య డా. ఇందిరా తనేజా కొన్నేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నారు.
ఈ జంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 24న సైబర్ నేరగాళ్లు వీరికి కాల్ చేశారు. ఇందిరకు కాల్ చేసి మాట్లాడారు. తాము కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ జంట అక్రమాలకు పాల్పడుతోందని, మనీ లాండరింగ్ కు పాల్పడుతోందని తమ వద్ద సమాచారం ఉందని బెదిరించారు. తాము చెప్పినట్లు చేయకుంటే శిక్ష తప్పదని వీడియో కాల్స్ ద్వారా బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఈ జంట వాళ్లు చెప్పినట్లుగానే చేశారు. దాదాపు రెండు వారాలపాటు వీళ్లకు ఫోన్స్, వీడియో కాల్స్ చేస్తూ బెదిరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తామని బెదిరించారు. అంతేకాదు.. ఇందిర బయటకు వెళ్లినప్పుడు ఆమె భర్తకు కాల్ చేసి.. తను ఎవ్వరికీ ఈ విషయం చెప్పకుండా చూడాలని హెచ్చరించారు.
ప్రభుత్వ అధికారులమని నమ్మించి.. ఎనిమిది వేర్వేరు బ్యాంక్ అకౌంట్లకు వీరి వద్ద ఉన్న డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత డబ్బు రీఫండ్ అవుతుందని నమ్మించారు. దీంతో తమ బ్యాంకు అకౌంట్ల నుంచి ఒకసారి రెండు కోట్లు, మరికొన్ని సార్లు మరింత అమౌంట్ చొప్పున ఎనిమిదిసార్లు ఈ దంపతులు రూ.14.85 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారు. డిసెంబర్ 24 నుంచి ఈ తతంగం కొనసాగింది. చివరకు సైబర్ నిందితులు చెప్పినట్లుగా శనివారం ఆర్బీఐ అధికారుల వద్దకు రీఫండ్ కోసం వెళ్లగా.. అక్కడి అధికారులు అసలు విషయం గుర్తించారు. వారు మోసపోయారని వివరించారు. అప్పుడు విషయం గ్రహించిన ఈ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నతాధికారులకు వివరించారు. ప్రత్యేక సెల్ ఈ కేసును పరిశీలిస్తోంది.
కాగా.. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడానికి వెళ్లినప్పుడే బ్యాంకు సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ, ఆమె ఈ విషయంలో సైబర్ నేరగాళ్లు చెప్పమన్న అబద్ధాలు చెప్పి, బ్యాంకు సిబ్బందిని నమ్మించింది. మరోవైపు తాము సంపాదించింది అంతా కోల్పోవడంతో ఎన్ఆర్ఐ జంట ఆవేదన వ్యక్తం చేస్తోంది.