న్యూఢిల్లీ : వినడానికి వింతగా ఉంటుంది కానీ ఎడారి దేశమైన సౌదీ అరేబియా ఇసుకను దిగుమతి చేసుకుంటున్నది. విజన్ 2030 ప్రాజెక్టుల నిర్మాణానికి దేశంలోని ఇసుక తగినది కాకపోవడంతో, నాణ్యమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియంల నుంచి రప్పిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణాలకు అత్యంత నాణ్యమైన ఇసుక దొరకడం కష్టంగా మారుతున్నది. అందుకే ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తున్నది. ఎడారిలో కనుచూపు మేరకు ఇసుక ఉంటుంది.
అనేక సంవత్సరాల నుంచి గాలి వల్ల ఒరుసుకుపోవడంతో ఇక్కడి ఇసుక రేణువులు గుండ్రంగా, సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఈ ఇసుకను సిమెంట్‌తో కలిపి భవన నిర్మాణాలకు ఉపయోగించడం సాధ్యం కాదు. నదులు, సరస్సులు, సముద్ర తీరాల్లో ఉండే గరుకు ఇసుకను మాత్రమే భవన నిర్మాణాలకు ఉపయోగించవచ్చు. అందుకే యూఏఈ, ఖతార్ కూడా ఇసుకను దిగుమతి చేసుకుంటున్నాయి. అత్యంత ఎత్తయిన భవనాలు, ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణానికి నాణ్యమైన ఇసుక అవసరం.