Asaduddin Owaisi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి బీ టీమ్‌గా ఉన్నారనే వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో పోటీ చేయడం పార్టీ సొంత విషయమన్నారు. పార్టీకి ఏది మంచిదో తమకు తెలుసునన్నారు. బలమైన స్థానాల్లోనే ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టామని.. మిగతా స్థానాల్లో రాష్ట్రం, సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నామన్నారు.
అధికార బీఆర్ఎస్కు మద్దతు ఏం ఇవ్వడం లేదన్నారు. అయితే, తొమ్మిది స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని.. మిగతా స్థానాల్లో కేసీఆర్‌కు అవకాశం ఇవ్వాలంటున్నామన్నారు. తమది ప్రాంతీయ పార్టీ అని.. మధ్యలో ఫుట్‌బాల్ ఆడకూడదనుకుంటున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటును తమ పార్టీ వ్యతిరేకించిందని.. మతతత్వ శక్తులు విభజనకు కారణమవుతాయని భావించామన్నారు. కాంగ్రెస్ మెరుగైన ప్రభుత్వాన్ని అందించలేకపోయిందన్నారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు.
మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజలకు చెప్పబోతున్నామన్నారు. రాహుల్ గాంధీకి పొలిటికల్ మతిమరుపు అనే వ్యాధి ఉందని.. దాన్ని ప్రపంచంలో ఏ వైద్యుడు నయం చేయడలేడన్నారు. 2019లో కాంగ్రెస్ అధ్యక్షుడు.. 500 స్థానాల్లో పోటీ చేసి 50 మినహా అన్ని ఓడిపోతే బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నారా? అంటూ రాహుల్‌ను నిలదీశారు. అమేథీలో ఓడిపోయినందుకు స్మృతి ఇరానీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? అంటూ ప్రశ్నించారు.
నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో రాహుల్ పెద్దవాడయ్యాడని.. మేం చిన్నవాళ్లమయ్యామంటూ విమర్శించారు. గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని.. అలాంటప్పుడు మన రాష్ట్రం నుంచి బయటకు వెళ్లి ఎందుకు పోటీ చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని యోగీ ఆదిత్యనాథ్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. కొందరు కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తారన్నారు. ఆయన ప్రచారం చేసిన చోట అభ్యర్థులు గెలువలేదన్నారు.