న్యూఢిల్లీ, జూన్ 21: విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది.
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఇటీవల కుప్పకూలి మంటల్లో దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీసీఏ కొంతమంది అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం.
ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్) ఉల్లంఘించినందుకు టాటా గ్రూపు యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు శనివారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మే 16, 17న ఎయిర్ ఇండియాకు చెందిన బెంగళూరు-లండన్ విమానాలను తనిఖీ చేసిన సందర్భంగా ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు వర్గాలు తెలిపాయి. ఈ తనిఖీలలో 10 గంటల పరిమితిని ఉల్లంఘించినట్లు గుర్తించామని షోకాజ్ నోటీసులో డీజీసీఏ పేర్కొంది.