Water Crisis : దేశ రాజధానిలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు ఆప్ ఉచిత నీటి సరఫరా గురించి పెద్దమాటలు చెబుతుంటే మరోవైపు పేదలు తాగునీటి కోసం రోజుకు రూ. 100 ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. నీటి సమస్య పరిష్కారం కోసం ఆప్ సర్కార్ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల రాజకీయ వైరంతో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఢిల్లీలో 98 శాతం వాటర్ లీకేజ్ ఉందంటే ఆప్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో నీటి సంక్షోభంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైషమ్యాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం విచారకరమని అన్నారు.
ఇరు ప్రభుత్వాలు తమ రాజకీయ విభేదాలను విడనాడి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని హితవు పలికారు. ప్రభుత్వాలు రాజకీయ పంతాలకు పోయి ప్రజలను సమస్యల్లోకి నెట్టడం సరైంది కాదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో నీటి ఎద్దడి నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పూనుకోవాలని ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.
Read More :