తిరువనంతపురం: అహ్మదాబాద్‌లో కూలిన(Ahmedabad Plane Crash) ఎయిర్ ఇండియా విమానంలో 241 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మృతుల్లో కేరళకు చెందిన రంజితా గోపకుమరన్ నాయర్ ఉన్నారు. ఆమె వయసు 42 ఏళ్లు. అయితే గవర్నమెంట్ నర్సుగా పనిచేసిన ఆ మళయాలీ.. లీవ్ తీసుకుని యూకేకు వెళ్లింది. అక్కడ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ డబ్బలు సంపాదిస్తోంది. అయితే ఇటీవల 5 రోజుల లీవ్‌పై ఆమె స్వంత రాష్ట్రానికి వచ్చింది. ఇళ్లు కట్టుకోవాలన్న కలను నిజం చేసుకునేందుకు ఆమె విదేశీ ఉద్యోగం కోసం బ్రిటన్ వెళ్లింది. ఇక ఆ ఇంటి పని కోసమే ఇటీవల కేరళకు వచ్చింది. అయితే గురువారం మళ్లీ బ్రిటన్ వెళ్తున్న ఆమె.. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానాన్ని ఎక్కింది. ఆ విమాన ప్రమాదంలో రంజితా ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విమాన ప్రమాదంలో చనిపోయిన నర్సు రంజితపై వెల్లరికుండు డిప్యూటీ తహసిల్దార్ ఏ పవిత్రన్ తన సోషల్ మీడియా అకౌంట్లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో జూన్ 13వ తేదీన కాసరగడ్ జిల్లా కలెక్టర్ కే ఇనబశేఖర్ .. డిప్యూటీ తహసిల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితురాలిపై పవిత్రన్ ఫేస్బుక్లో అనుచిత కామెంట్స్ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రెవన్యూ శాఖకు అపఖ్యాతిని తీసుకువచ్చినట్లు చెప్పారు. పవిత్రన్ తన ఫేస్బుక్ అకౌంట్లో కామెంట్ చేస్తూ.. విమాన ప్రమాద బాధితుల్లో ఓ నాయర్ మహిళ ఉందని, ఆమె చనిపోయిందని, కేరళ ప్రభుత్వం ఆమెకు ఉద్యోగం ఇచ్చిందని, కానీ ఆమె లీవ్ పెట్టి విదేశాలకు వెళ్లిందని, ఆమెకు దక్కాల్సిందే దక్కినట్లు విమర్శించాడు. ఆ పోస్టుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. తహిసిల్దార్ను తొలగించాలని పబ్లిక్ డిమాండ్ చేశారు. దీంతో కాసరగడ్ కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
గతంలో ఓ సారి కన్‌హంగద్ ఎమ్మెల్యే ఈ చంద్రశేఖర్ కులంపై కామెంట్ చేసిన కేసులోనూ పవిత్రన్‌పై చర్యలు తీసుకున్నారు. 2024 సెప్టెంబర్‌లో కూడా అతన్ని కలెక్టర్ సస్పెండ్ చేశాడు. బ్రిటన్‌లో ఏడాది నుంచి రంజిత నర్సుగా చేస్తున్నది. ఇంటి నిర్మాణ పనులు చూసేందుకు ఆదివారం ఆమె ఇంటికి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. కేరళ ఆరోగ్యశాఖలో ఉద్యోగం సంపాదించిన కారణంగా.. బ్రిటన్‌లో జాబ్ కాంట్రాక్టును ముగించుకుని త్వరగా కేరళకు రావాలన్న ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలిసింది.