న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశాన్ని దట్టమైన పొగమంచు(Dense Fog) కమ్ముకున్నది. పంజాబ్ నుంచి బీహార్ వరకు .. ఆకాశం విషపూరితంగా మారింది. గంగానది పరివాహక ప్రాంతాల్లో విజిబిలిటీ చాలా తగ్గిపోయింది. శుక్రవారం ఉదయం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో భారతీయ వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్డు, రైలు, ఆకాశ మార్గాల్లో ప్రయాణాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొన్నది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేవ్, బీహార్ రాష్ట్రాల మీద దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 5.30 నిమిషాలకు కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోగా రికార్డు అయ్యింది. ఆగ్రా, బరేలీ, షహరాన్‌పూర్, గోరఖ్‌పూర్, అంబాలా, అమృత్సర్, బఠిండా, లుథియానా, ఆదమ్పూర్, షఫ్దార్గంజ్, గ్వాలియర్, భగల్పూర్,దాల్తోగంజ్ పట్ణాల్లో విజిబిలిటీ శూన్యంగా ఉన్నది.
భారతీయ వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. విమానాశ్రయాలు, జాతీయ రహదారులపై ప్రయాణాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. యూపీలోని ఆగ్రా, అలీఘడ్, భాగ్పాట్, బరేలీ, బిజ్నోర్, బులంద్‌షెహర్, ఈటా, ఇట్వా , ఫిరోజ్‌బాద్, గౌతమ్ బుద్ద నగర్, ఘజియాబాద్, హాపుర్, హత్రాస్, మథురా, మీరట్, మొరాదాబాద్, ముజాఫర్‌నగర్, ఫిలిబిత్, రాంపూర్, హరిద్వార్, ఉద్దమ్ సింగ్ నగర్, గురుదాస్ పూర్, పాటియాలా, సంగ్రూర్ పట్టణాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్డు ప్రయాణాలు సమస్యాత్మకంగా మారనున్నట్లు ఐఎండీ తన హెచ్చరికల్లో పేర్కొన్నది. ప్రభావిత ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ఆమె సూచించారు.