న్యూఢిల్లీ : సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్), ఈడీ (ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) డైరెక్టర్ల పదవీకాలం పొడగింపుపై సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల పాటు పొడగిస్తూ ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌పై సత్వరమే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. పిటిషన్ విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమని పిటిషనర్ ఆరోపించారు. సభలో మెజారిటీ లేకుండా ఆర్డినెన్స్ జారీ చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ఇదిలా ఉండగా.. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సైతం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఆర్డినెన్స్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరారు. అలాగే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా పిటిషన్ దాఖలు చేశారు.