Farmers long march | ముంబై, ఏప్రిల్ 26 : మహారాష్ట్ర రైతన్న మళ్లీ సమరశంఖం పూరించాడు. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి పదేపదే మోసపోతున్న అన్నదాత.. ఈసారి మాత్రం డిమాండ్ల సాధనకోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని ప్రతిన బూనాడు. నెలన్నర క్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వెన్నుపోటు పొడువటంతో రైతులోకం ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకొన్నది. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నేతృత్వంలో చెరకు, పత్తి రైతులతోపాటు పాల ఉత్పత్తిదారులు అహ్మద్‌నగర్ నుంచి లోనీ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. రైతులపై పోలీసుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
మాట తప్పిన శివసేన-బీజేపీ సర్కారు
రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను పేద రైతులకు పంచాలని, పంటలకు గిట్టుబాటు ధర, ఇన్సూరెన్స్ కల్పించాలని, అతివృష్టి-అనావృష్టి సమయంలో రైతులకు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించి ఆదుకోవాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముంబై-వడోదరా ఎక్స్‌ప్రెస్ వే కోసం పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద రైతుల ఇండ్లను ప్రభుత్వం బలవంతంగా కూల్చివేసింది. వారికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. రత్నగిరి జిల్లాలో ఆయిల్ రిఫైనరీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులపై పోలీసులు దాడులకు పాల్పడి ఇద్దరు రైతులను అరెస్టు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఇవే డిమాండ్లలో రైతులు లాంగ్‌మార్చ్‌కు పిలుపునివ్వటంతో డిమాండ్లను పరిష్కరిస్తామని శివసేన-బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటికీ వాటి గురించి పట్టించుకోనేలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు ఈసారి డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు.
రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి
మహారాష్ట్రలో వక్ఫ్, ఆలయాలు, ఇతర ట్రస్టుల కింద 6 లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఈ భూముల్లో చాలాచోట్ల పేద రైతులు నివాసాలు ఏర్పాటుచేసుకొన్నారు. వీరిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు తరుచూ బలప్రయోగం చేస్తున్నారు. ఇండ్లను కూలగొడుతున్నారు. ఈ భూములపై రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతు సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. ‘అకాల వర్షాలు, వడగండ్ల వానకు పాడైపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలన్న మా డిమాండ్‌పై ప్రభుత్వం కనీసం స్పందించలేదు.
అందుకే మా మార్చ్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నాం. జీవనాధారం కోల్పోయి పోరాటం చేస్తున్న రైతులపై పోలీసుల దౌర్జన్యాలు ఆగటం లేదు. గత రెండేండ్లు అతివృష్టి, అనావృష్టితో మహారాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించినా ఇప్పటివరకూ ఇవ్వలేదు. వెస్ట్ ఫారెస్ట్, గుడులు, ఇనామ్, వక్ఫ్ భూముల్లో పేద రైతులు, కూలీలకు ఇండ్లు కట్టించి ఇస్తామని ఎన్నోసార్లు హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. ఆ భూముల్లో గుడిసెలు వేసుకొని బతుకుతున్న రైతులను పోలీసులు హింసిస్తున్నారు. ఇండ్లు కూలగొట్టి అక్కడి నుంచి గెంటేస్తున్నారు’ అని ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ఢవలే ఆగ్రహం వ్యక్తంచేశారు.
పెట్టుబడి రూ.25.. ఆదాయం రూ.20
మహారాష్ట్రలో పాల ఉత్పత్తిదారుల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఫ్యాట్ పేరుతో సహకార సంఘాలు, కార్పొరేట్ కంపెనీలు పాడి రైతులను నిలువునా ముంచుతున్నాయని దీపక్ లిపన్ అనే రైతు ఆవేదన వ్యక్తంచేశారు. ‘లీటర్ పాల ఉత్పత్తికి రూ.25 ఖర్చు అవుతుంటే.. ఆ లీటర్ అమ్మితే రైతుకు వస్తున్నది రూ.20 మాత్రమే. అదే లీటర్ పాలను నగరాల్లో రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నప్పుడు అందులో రైతులకు వాటా ఎందుకు ఇవ్వకూడదు?’ అని లిపన్ ప్రశ్నించారు. వ్యవసాయ సాగు వ్యయం రెండుమూడింతలు పెరిగినా పంటలకు ధర మాత్రం పైసా కూడా పెరగలేదని అన్నారు. ‘విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, కూలీల రేట్లు భారీగా పెరిగాయి. పత్తి ధర మాత్రం పెరగకపోగా తగ్గుతున్నది. నేను 2012లో క్వింటాల్ పత్తి రూ.7000కు అమ్మాను. అప్పుడు డీఏపీ బస్తా ధర రూ.500. నేడు క్వింటాల్ పత్తి ధర అదే రూ.7 వేలు, అంతకంటే తక్కువే ఉన్నది. డీఏపీ బస్తా ధర మాత్రం రూ.1,700 అయ్యింది’ అని తెలిపారు.
సుదీర్ఘ పోరాటాలు
రైతు ఉద్యమాలకు మహారాష్ట్ర దశాబ్దాలుగా ప్రధాన కేంద్రంగా ఉన్నది. రాష్ట్రంలో ప్రతి గ్రామం ఒక రైతు ఉద్యమ క్షేత్రమే. పెద్ద పెద్ద సంఘాలతో అవసరం లేకుండా రెండుమూడు గ్రామాల రైతులు కలిసి కూడా ప్రభుత్వాన్ని కదిలించే ఉద్యమాలు లేవదీసిన సందర్భాలున్నాయి. ఇటీవలికాలంలో మహారాష్ట్రలో భారీ రైతు ఉద్యమాలు కొనసాగాయి. 2017లో నాసిక్ నుంచి ముంబైకి 200 కిలోమీటర్ల దూరం 70 వేల మంది రైతులు చేపట్టిన లాంగ్‌మార్చ్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ మార్చ్ ముంబై చేరుకొన్న సమయంలో ఎంతోమంది సెలబ్రిటీలు స్వచ్ఛందంగా వచ్చి రైతులకు స్వాగతం పలికారు. రోడ్లపై రైతులు నడిచేందుకు వాహనదారులు స్వచ్ఛందంగా తమ వాహనాలను నిలిపేశారు.
2018 జూన్ 1న మరోసారి చేపట్టిన ఆందోళనతో దిగొచ్చిన నాటి ప్రభుత్వం.. రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో 2019లో రైతులు మరోసారి లాంగ్‌మార్చ్‌కు పిలుపునిచ్చారు. అప్పుడూ ప్రభుత్వం హామీలతోనే సరిపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా రైతులు భారీ ఆందోళనకు పిలుపునివ్వటంతోపాటు నాసిక్ నుంచి ముంబైకి మరోసారి లాంగ్‌మార్చ్ చేస్తామని ప్రకటించారు. దీంతో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఏక్నాథ్ షిండే స్వయంగా అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. మరోవైపు వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంటున్నది. ప్రభుత్వం చేతిలో గతంలో ఎన్నోసార్లు మోసపోయామని, ఈసారి మాత్రం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతామని రైతన్నలు తెగేసి చెప్తున్నారు.