న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 46 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్‌పై ప్రభుత్వం ఇస్తున్న రాయితీ (Power Subsidy) శుక్రవారం నుంచి నిలిచిపోయింది. దీంతో ఢిల్లీలో అధికారంలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో పోరు షురూ అయ్యింది. ఢిల్లీ ప్రజలకు పవర్ సబ్సిడీని మరో ఏడాది పొడిగించే ఫైల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలుపలేదని విద్యుత్ శాఖ మంత్రి అతిషి ఆరోపించారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌పై రాయితీ శుక్రవారం నుంచి నిలిచిపోతుందని ఆమె వెల్లడించారు. దీంతో సోమవారం నుంచి రాయితీ లేని విద్యుత్ బిల్లులు ప్రజలకు అందుతాయని అన్నారు. వచ్చే ఏడాదికి కూడా విద్యుత్ రాయితీ వ్యయాన్ని భరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. అయినప్పటికీ దీనికి సంబంధించిన కీలక ఫైల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదించలేదని ఆరోపించారు. దీని కోసం ఎల్జీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఆయన స్పందించలేదని విమర్శించారు.
మరోవైపు, ఈ ఆరోపణలు నిరాధారమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు. అనవసర రాజకీయాలు మానుకోవాలని విద్యుత్ మంత్రి అతిషికి సూచించింది. ఏప్రిల్ 4 వరకు ఈ నిర్ణయాన్ని ఎందుకు పెండింగ్‌లో ఉంచారని ప్రశ్నించారు. ఏప్రిల్ 15తో గడువు ముగియనుండగా ఫైల్‌ను ఏప్రిల్ 11న ఎందుకు పంపారని ఎల్జీ నిలదీశారు. ఏప్రిల్ 13న లేఖ రాసి, మీడియా ముందు డ్రామా ఆడాల్సిన అసవరం ఏముందని విమర్శించారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానేయాలని విద్యుత్ మంత్రి అతిషికి సూచించారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఒక స్టేట్మెంట్ను విడుదల చేసింది.
కాగా, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. 201 నుంచి 400 యూనిట్లు వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. దీనిని రూ.850కు పరిమితం చేసింది. అయితే విద్యుత్ రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ఇస్తామని సీఎం కేజ్రీవాల్ గత ఏడాది ప్రకటించారు. దీంతో అధికార గణాంకాల ప్రకారం ఢిల్లీలో 58 లక్షలకు పైగా ఉన్న గృహ వినియోగదారులలో 48 లక్షల మంది వినియోగదారులు విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ రాయితీ వ్యయాన్ని భరించేందుకు ఆప్ ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో రూ.3,250 కోట్లు కేటాయించింది.
Also Read: