చెన్నై: తమిళనాడులో అధికారంలో డీఎంకే పార్టీపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పలు ఆరోపణలు చేశారు. గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 2011 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెన్నై మెట్రో రైలు కాంట్రాక్టును దక్కించుకునేందుకు ఒక కంపెనీకి అనుకూలంగా వ్యవహరించినందుకు రూ.200 కోట్లు లంచంగా ఇచ్చినట్లు ఆరోపించారు. విదేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిగాయని చెప్పారు. అలాగే సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పోన్ముడి, వీ సెంథిల్ బాలాజీ, మాజీ కేంద్ర మంత్రి ఎస్ జగత్రక్షకన్‌తో సహా డీఎంకే కీలక నేతలకు చెందిన రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆస్తుల జాబితాను బహిరంగపరిచారు. ‘డీఎంకే ఫైల్స్’ (DMK Files) పేరుతో సుదీర్ఘ జాబితాను విడుదల చేశారు. డీఎంకే నేతలకు చెందిన ఈ ఆస్తులన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలో పేర్కొన్నవే అని అన్నారు. జర్నలిస్టులు వీటిని వెరిఫై చేసుకోవాలని సూచించారు. వారం రోజుల తర్వాత ఈ లిస్ట్‌పై జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెబుతానని అన్నారు.
కాగా, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఈ ఆరోపణలను డీఎంకే నేతలు ఖండించారు. డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి ఈ ఆరోపణలను జోక్ అని అన్నారు. ఆయన పేర్కొన్న డీఎంకే నేతలంతా తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారని తెలిపారు. వాటిలో ఏ ఒక్కటి తప్పుగా అనిపించినా వారి ఎన్నికను ప్రజలు సవాల్ చేయవచ్చని అన్నారు. ఏళ్ల కిందట రూ.87 కోట్లతో నిర్మించిన ఎల్ఐసీ భవనం విలువ ఇప్పుడు వేలాది కోట్లు ఉంటుందన్నారు. అన్నామలై ఆరోపించిన లెక్కలు కూడా అలాగే ఉన్నాయన్నారు. ఈ ఆరోపణలపై తమ నేతలంతా కోర్టుకు వెళితే ఆయన రోజూ కోర్టు చుట్టూ తిరుగాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మరోవైపు రూ.200 కోట్లు లంచం ఇచ్చినట్లుగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేయాలని డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి సవాల్ విసిరారు. అదానీ కంపెనీలు పాల్పడిన అవకతవకల వ్యవహారం గురించి హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో తప్పుడు నివేదికను ఆయన విడుదల చేశారని దుయ్యబట్టారు. ఆయన ఆరోపించిన చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ అవినీతిపై 2014 నుంచి సీబీఐ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ఇలాంటి చవకబారు ఆరోపణలతో డీఎంకే ప్రతిష్టకు ఎలాంటి నష్టం జరుగదని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సీట్లు తాము గెలుచేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ఇక అన్నామలై పేర్కొన్నట్లుగా ఆయన ఇంటి అద్దె నుంచి ఇతర ఖర్చులకు సంబంధించి నెలకు ఏడు నుంచి ఎనిమిది లక్షలను ఇతరులు, ఆయన పార్టీ భరిస్తే ఇక ఆయనకు సొంతంగా ఏమి ఉన్నాయని డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి ప్రశ్నించారు.
Also Read: