Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Air Pollution) చిక్కుకుని అల్లాడిపోతోంది. శీతాకాలం కావడంతో ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం (air quality crisis) తలెత్తింది. గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. ఏక్యూఐ లెవెల్స్ 400కిపైనే నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య కట్టడికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని సంస్థలకు 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home)ను తప్పనిసరి చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని కూడా హెచ్చరించింది. అంతేకాదు, కాలుష్య నిరోధక ఆంక్షల కారణంగా పని కోల్పోయిన రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులకు రూ. 10,000 పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాజధాని ఢిల్లీలో కాలుష్యం కట్టడిపై అక్కడి ట్రిపుల్ ఇంజిన్ సర్కారు చేతులెత్తేసింది. రోజురోజుకూ దిగజారుతున్న కాలుష్య ప్రమాణాలపై బీజేపీ మంత్రి మంజీందర్ సింగ్ మంగళవారం ప్రజలకు క్షమాపణ చెప్పారు. కాలుష్య కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన, ఆ తప్పునకు మాత్రం మునుపటి ఆప్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేవలం 9,10 నెలల్లో కాలుష్య స్థాయిని తగ్గించడం సాధ్యం కాదన్నారు. ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో ఇక నుంచి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (PUCC)ని చూపిన వాహనదారులకే ఇంధనం నింపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read..
Anant Ambani | మెస్సికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్నికోట్లంటే..?
Lionel Messi | నమస్తే ఇండియా.. ఇంత గొప్ప ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు : మెస్సి
Mahatma Gandhi | హే రామ్!.. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముడిపేరు తొలగింపు..