న్యూఢిల్లీ, డిసెంబర్ 16: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వీబీ-జీ రామ్ జీ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై విపక్ష సభ్యులు మంగళవారం పార్లమెంట్లో తీవ్ర నిరసన తెలిపారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీని అవమానిస్తున్నదని ఆరోపిస్తూ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండు చేశారు. ఎంజీనరేగా స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్(గ్రామీణ్)(వీబీ-జీ రామ్ జీ) బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెడుతూ మహాత్మా గాంధీని విశ్వసించడంతోపాటు ఆయన సిద్ధాంతాలను ప్రభుత్వం ఆచరిస్తున్నదని తెలిపారు.
ప్రవేశ దశలోనే బిల్లుపై తీవ్ర వ్యతిరేకత ప్రకటించిన విపక్ష సభ్యులు పరిశీలన నిమిత్తం బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండు చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు విపక్ష ఎంపీలు బిల్లులో మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై అభ్యంతరం తెలిపారు. డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామాల్లో నివసించి అక్కడి పేదల సంక్షేమం కోసం పాటుపడ్డారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 100 రోజుల పని కల్పించి వారిని ఆదుకున్న ఉదాత్తమైన బిల్లును(ఎంజీనరేగా)ను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం జాతిపితను అపహాస్యం చేస్తున్నదని ఆయన ఆరోపించారు.
ముసాయిదా చట్టం పట్ల తన తీవ్ర అభ్యంతరాన్ని ప్రకటించిన ప్రియాంక గాంధీ నరేగాను విప్లవాత్మక చట్టంగా అభివర్ణించారు. అప్పుడు ఆ చట్టాన్ని ఆమోదించినపుడు సభలోని సభ్యులందరూ ఆమోదం తెలిపారని ఆమె గుర్తు చేశారు. దేశంలోని నిరుపేదలకు 100 రోజుల ఉపాధి లభించిందని, కాని ప్రస్తుత బిల్లు పేదల ఉపాధి హక్కులను బలహీనపరుస్తున్నదని ఆమె ఆరోపించారు. ఇది రాజ్యాంగానికే వ్యతిరేకమని ఆమె తెలిపారు. నరేగా కింద చేపట్టిన పనులకు కేంద్రం 90 శాతం నిధులు అందచేసేలా చట్టం నిర్దేశించిందని, కాని ప్రస్తుత బిల్లు దాన్ని 60 శాతానికి తగ్గిస్తున్నదని ఆమె చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని, ప్రత్యేకంగా జీఎస్టీ పరిహారం కోసం ఎదురుచూసే రాష్ర్టాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపగలదని ఆమె అన్నారు.
ప్రతిపాదిత కొత్త చట్టం ద్వారా పథకంపై కేంద్ర పెత్తనం పెరిగి బాధ్యత తగ్గిపోతుందని ఆమె చెప్పారు. అధికార పార్టీ ఎంపీలు చేసిన కొన్ని వ్యాఖ్యలపై ప్రియాంక స్పందిస్తూ మహాత్మా గాంధీ తమ కుటుంబానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదని, దేశంలోని ప్రతి కుటుంబానికీ చెందిన వ్యక్తని అన్నారు. ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఆమె ప్రతిపాదించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రతిపాదిత చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శ్రీరాముడి పేరును చెడగొట్టవద్దంటూ హితవు చెప్పే 1971 నాటి బాలీవుడ్ పాటను గుర్తు చేశారు. మహాత్మా గాంధీ ఫొటోలు పట్టుకుని కొందరు విపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు.
సభలోనుంచి వెలుపలకు వచ్చిన అనంతరం విపక్ష సభ్యులంతా కలసి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాంప్లెక్స్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రియాంక గాంధీతోపాటు సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ్‌చంద్రన్ తదితరులు నిరసన తెలిపారు. మహాత్మా గాంధీని అవమానిస్తే దేశం సహించదు అంటూ వారు నినాదాలు చేశారు. చేతిలో మహాత్మా గాంధీ చిత్ర పటాలతో పార్లమెంట్ మకర్ ద్వార్ వద్దకు చేరుకున్న విపక్ష ఎంపీలు అక్కడ నుంచి ప్రేరణ స్థల్లో జాతిపిత విగ్రహం వద్దకు నడిచారు.
దేశ స్వాతంత్య్రోద్యమంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించి జాతి ఆత్మను మేల్కోలిపిన మహాత్మా గాంధీని కేంద్ర ప్రభుత్వం అవమానిస్తున్నదని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. కొత్తగా చేయడానికి ఏమీ లేకపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం పాత పథకాల పేర్లు మారుస్తున్నదని ఆయన ఎద్దేవా చేశారు. పథకాల పేర్లు మార్చడంలో మోదీ ప్రభుత్వం చూపుతున్న వ్యామోహాన్ని ప్రియాంక ఎండగట్టారు. మన జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పథకం పేరును కూడా మారుస్తారా అని ఆమె నిలదీశారు.