న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: గత వారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనపై కేంద్రం, రైల్వే శాఖపై బుధవారం ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోచ్‌ల సామర్థ్యానికి మించి రైల్వే శాఖ టికెట్లను ఎందుకు అమ్మిందని, వారిని ఏ బోగీలో కూర్చోబెడతామనుకున్నారని ప్రశ్నించింది.
ఢిల్లీ ప్రమాదంపై దాఖలైన పిల్‌ను విచారించిన ధర్మాసనం ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేస్తూ ప్రస్తుతం ఉన్న చట్టాల అమలుకు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఎంతమందికి జరిమానా విధించారు? అని ప్రశ్నించింది. ్ర‘రద్దీ రోజుల్లో నిర్ధారిత పరిమితి కన్నా ఎక్కువ టికెట్లు అమ్మడం సమంజసంగానే ఉన్నా దానికి తగ్గట్టుగా సీట్ల సంఖ్యను పెంచాలి కదా? జారీ చేసిన టికెట్ల సంఖ్యను చూస్తే సీట్ల సామర్ధ్యాన్ని మించిపోయాయి. అ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు కదా’ అని ప్రశ్నించింది.