న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 1.56 కోట్ల ఓటర్లున్న దేశ రాజధానిలో ఓటింగ్ కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 70 స్థానాల్లో 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 220 కంపెనీల పారా మిలటరీ దళాలు, 35 వేల మంది ఢిల్లీ పోలీసులు, 19 వేల మంది హోంగార్డులను పోలింగ్ భద్రత కోసం ఈసీ వినియోగిస్తున్నది.
మూడు వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా పేర్కొన్న ఈసీ ఆ ప్రాంతాల్లో అదనంగా భద్రతా దళాలను మోహరించి, డ్రోన్లతో ఓటింగ్‌ను పర్యవేక్షించనుంది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు, 25 ఏండ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్.. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్నది.
కాగా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానాలో కేసు నమోదైంది. యమునా నదీ జలాలను విషతుల్యం చేశారని కేజ్రీవాల్ చేసిన ఆరోపణపై ఈ కేసు నమోదు చేశారు. విద్వేష వ్యాప్తి, తప్పుడు ఆరోపణలు, అల్లర్ల ప్రేరేపణ తదితర ఆరోపణతో వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది.