న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని, ఆప్-దా(విపత్తు) నుంచి స్వేచ్ఛ లభించినందుకు ఢిల్లీ ప్రజలు ఉత్సాహం, సంతృప్తితో ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీ విజయోత్సవ సభలో మోదీ పాల్గొన్నారు. “మోదీ కీ గ్యారెంటీ’పై విశ్వాసాన్ని ఉంచిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచింది. ఢిల్లీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రజాతీర్పును వినయంగా అంగీకరిస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు. రానున్న ఐదేండ్లు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాం’ అని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు.