ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. రెండున్నర దశాబ్దాల తర్వాత హస్తినలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 2 శాతం కంటే తక్కువ ఓట్లతో అధికార ఆమ్ఆద్మీ పార్టీ పరాజయం పాలైంది. 70 స్థానా ల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ఆప్ ప్రముఖులంతా ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ‘సున్నా’ స్థానాలతో హ్యాట్రిక్ సాధించింది. పార్లమెంట్ ఫలితాలను కూడా కలిపితే ‘సున్నా’ల్లో డబుల్ హ్యాట్రిక్ అందుకుంది. దారుణంగా ఓడినప్పటికీ హస్తం పార్టీ సాధించిన ఓట్లు బీజేపీ విజయానికి, ఆప్ ఓటమికి కారణమయ్యాయి. ఇండియా కూటమి పార్టీలు విడిగా పోటీ చేసి బీజేపీకి దేశ రాజధానిలో అధికారాన్ని అప్పగించాయి.
Delhi Elections | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశ రాజధాని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వశమైంది. 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పదేండ్ల ఆప్ పాలనకు బ్రేకులు వేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ 70 స్థానాలకు గానూ 48 స్థానాలను దక్కించుకొని ఘన విజయాన్ని అందుకుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి 22 స్థానాలకే పరిమితమైంది. 2013లో ఢిల్లీలో ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్ ఇప్పుడు కంచుకోటలోనే చతికిలపడింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా ముఖ్య నేతలు సైతం ఓటమి చవిచూశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఢిల్లీ అసెంబ్లీలో ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. అయితే, హస్తం పార్టీ సాధించిన ఆరు శాతం ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాయి. మిగతా పార్టీలేవీ ప్రభావం చూపలేకపోయాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శనివారం జరిగింది. ఫలితాల లెక్కింపు మొదటి రౌండ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీపైన బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అధికారం సాధించేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా 48 స్థానాలను దక్కించుకుంది. 2015 ఎన్నికల్లో 3 స్థానాలకు, 2020 ఎన్నికల్లో 8 స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్నది. మరోవైపు 2015లో 67 స్థానాలు, 2020లో 62 స్థానాలతో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి 22 స్థానాలకే పరిమితమైంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సున్నా స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఒక్క సీటునూ గెలవలేకపోయింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి కంచుకోట లాంటి ఢిల్లీలో అధికారం కోల్పోవడం ఒక ఎదురుదెబ్బ కాగా, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓటమి చవిచూడటం మరో చేదు అనుభవం. మూడుసార్లు న్యూఢిల్లీ నుంచి భారీ విజయాలను అందుకున్న కేజ్రీవాల్ ఈసారి ఓడిపోయారు. కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ 4,089 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌కు 4,568 ఓట్లు మాత్రమే వచ్చాయి. జంగ్‌పురాలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా 675 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా ఇక్కడ విజయం సాధించారు. ఆప్ కీలక నేతలు సత్యేంద్ర జైన్ షాకూర్ బస్తీ నుంచి, సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాశ్ నుంచి, మాల్వియా నగర్ నుంచి సోమ్‌నాథ్ భారతి ఓటమి చవిచూశారు.
సీట్ల సంఖ్యను చూస్తే ఆప్‌పై బీజేపీ భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఓట్లపరంగా మాత్రం స్వల్ప ఆధిక్యాన్నే సాధించగలిగింది. కమలం పార్టీకి 45.56 శాతం ఓట్లు రాగా, ఆమ్ ఆద్మీకి 43.57 శాతం ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే బీజేపీకి కేవలం 1.99 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. ఓట్ల సంఖ్యలోనూ రెండు పార్టీల మధ్య తేడా స్వల్పంగానే ఉంది. బీజేపీకి 43.23 లక్షల ఓట్లు రాగా, ఆమ్ ఆద్మీకి 41.33 లక్షల ఓట్లు వచ్చాయి.
ఆప్ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా పని చేసింది. ఆప్‌పై బీజేపీ పెద్ద ఎత్తున చేసిన అవినీతి ఆరోపణలు, నేతల అరెస్టులు, ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని కేజ్రీవాల్‌పై చేసిన ఆరోపణలు సైతం ఆప్‌కి నష్టం చేశాయి. నగరంలో పాడైన రోడ్లు, తీవ్ర కాలుష్యం, పారిశుద్ధ్య నిర్వహణలోపం, యమునా నది కాలుష్యం వంటి సమస్యలు కూడా ఆమ్ ఆద్మీ ఓటమికి చాలావరకు కారణమయ్యాయి.
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత ఇప్పుడు ఢిల్లీలోనూ కాంగ్రెస్ పరాభవాన్ని ఎదుర్కొన్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా ఒక్క స్థానమూ దక్కలేదు. 2015, 2020 ఎన్నికల్లో సున్నా సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ఈ ఎన్నికల్లోనూ సున్నాతో హ్యాట్రిక్ నమోదు చేసింది. 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయగా 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. 69 నియోజకవర్గాల్లో మూడో స్థానానికే కాంగ్రెస్ అభ్యర్థులు పరిమితమయ్యారు. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ వంటి కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా దారుణంగా ఓడిపోయారు.
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వాములే అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయడం బీజేపీకి కలిసొచ్చింది. రెండు పార్టీల మధ్య ఓట్ల చీలికతో బీజేపీ విజయం సులువైంది. కాంగ్రెస్‌కు 6.34 శాతం, దాదాపు 6 లక్షల ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 4.26 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి దాదాపు 2 శాతానికి పైగా ఓట్లను అధికంగా పొందింది. ఆప్‌పై బీజేపీ సాధించిన ఆధిక్యం కంటే కాంగ్రెస్ పొందిన ఓట్లు చాలా ఎక్కువ. తద్వారా ఢిల్లీలో బీజేపీ విజయానికి, ఆప్ ఓటమికి కాంగ్రెస్ పరోక్షంగా దోహదపడినట్టు కనిపిస్తున్నది. ఓటమి పాలైన ఆప్ కీలక నేతల స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు సాధించిన మెజారిటీల కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.