న్యూఢిల్లీ: ఆప్ నేత సత్యేంద్ర జైన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో.. ఢిల్లీ హైకోర్టు(Delhi court) ఇవాళ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చింది. 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు పేర్కొన్నది. స్వరాజ్‌పై ఫిర్యాదును కొట్టివేసిన ట్రయల్ కోర్టు ఆదేశాలను సత్యేంద్ర జైన్ సవాల్ చేశారు. మార్చి 22న స్వరాజ్‌కు స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ నోటీసు జారీ చేశారు. సత్యేంద్ర రివిజన్ పిటీషన్‌కు కౌంటర్ దాఖలు చేసేందుకు స్వరాజ్‌కు నాలుగు వారాల సమయం ఇస్తున్నట్లు జడ్జి తెలిపారు. ఈ కేసును మే 14వ తేదీకి వాయిదా వేశారు.
స్వరాజ్‌పై నేరపూరిత పరువునష్టం కేసును సత్యేంద్ర ఫైల్ చేశారు. అయితే ఆ కేసును ఫిబ్రవరి 20వ తేదీన కోర్టు కొట్టివేసింది. క్రిమినల్ డిఫమేషన్ కింద రెండు ఏళ్ల జైలుశిక్ష ఉంటుంది. 2023, అక్టోబర్ 5వ తేదీన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన పరవును తీసేలా ఆమె మాట్లాడినట్లు జైన్ ఆరోపించారు. లక్షల సంఖ్యలో ఆ ప్రోగ్రామ్‌ను ప్రజలు చూశారన్నారు. తన ఇంటి నుంచి 3 కోట్లు రికవర్ చేశారని, దాంతో పాటు 1.8 కేజీల బంగారం, 133 గోల్డ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నట్లు స్వరాజ్ ఆరోపించారని సత్యేంద్ర తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసం స్వరాజ్ తనపై ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ఆరోపించారు. అవినీతిపరుడు, ఫ్రాడ్ అని తనను స్వరాజ్ నిందించారని కూడా తన ఫిర్యాదులో సత్యేంద్ర పేర్కొన్నారు.