Tahawwur Rana | 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో అరెస్టై ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana) తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేందుకు కోర్టు (Delhi Court) అనుమతి ఇచ్చింది. జైలు నిబంధనలకు అనుగుణంగా, తీహార్ జైలు సీనియర్ అధికారి పర్యవేక్షణలో రాణా తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడొచ్చని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తెలిపింది.
ప్రస్తుతం కస్టడీలో ఉన్న 64 ఏళ్ల తహవ్వూర్ రాణా తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మే 27న న్యూఢిల్లీలోని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. జైలు నిబంధనల ప్రకారం.. రాణాకు భవిష్యత్తులో క్రమం తప్పకుండా ఫోన్లో మాట్లాడే వెసులుబాటు కల్పించాలా వద్దా అనేదానిపై జైలు అధికారుల నుంచి కోర్టు వివరణాత్మక నివేదికను కోరింది. అంతేకాదు, రాణా ఆరోగ్య సమస్యలపై కూడా నివేదికను పది రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది.
ముంబై ఉగ్రదాడి కుట్రదారు డేవిడ్ కోల్మాన్ హెడ్లీతో తహవూర్ రాణాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి ఉగ్రదాడికి ప్రణాళిక రచించారు. దాడి అనంతరం అమెరికాకు పారిపోయిన రాణాను ఇటీవలే స్వదేశానికి రప్పించారు. భారత్ అప్పగించవద్దంటూ రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దాంతో అతడిని భారత్‌కు అప్పగించారు.
కాగా భారత్‌లో అక్రమంగా చొరబడిన 10 ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న తమ నరమేథం మొదలుపెట్టారు. రెండు లగ్జరీ హోటళ్లు, రైల్వేస్టేషన్, జెవిస్ సెంటర్ ఇలా నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా 60 గంటలపాటు సాగిన నరమేథంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు భద్రతాసిబ్బంది కూడా ఉన్నారు. భద్రతా బలగాల దాడిలో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత అతడికి ఉరిశిక్ష విధించారు.
Also Read..
RCB | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ