న్యూఢిల్లీ, మే 27: లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈమేరకు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. ‘అనారోగ్య సమస్యలకు సంబంధించి ప్రాథమిక వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని వైద్య పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 7 వరకు జరపాల్సి ఉందని వైద్య బృందం తెలిపింది. కీలకమైన వైద్య పరీక్షలు పూర్తిచేసేందుకు మరో 7 రోజులు బెయిల్ అవసరం’ అంటూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు పిటిషన్లో కోరారు. జూన్ 9న కేజ్రీవాల్ సరెండర్ అవుతారని తెలిపారు. పిటిషన్ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు రానున్నట్టు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు మే 10న అత్యున్నత న్యాయస్థానం 21 రోజులపాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.