CM Arvind Kejriwal | న్యూఢిల్లీ, మే 11: నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ మిషన్‌ను ప్రారంభించారని, ఆయన మళ్లీ గెలిస్తే రెండు నెలల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మార్చేస్తారని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, మనోహర్‌లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ రాజకీయ జీవితాలను మోదీ అంతం చేశారని.. ఇక యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితాన్ని అంతం చేస్తారని అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శనివారం ఆయన ఢిల్లీలో మొదటిసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. 75 ఏండ్లకు రిటైర్మెంట్ అనే నిబంధనను బీజేపీలో మోదీనే తీసుకొచ్చారని, వచ్చే ఏడాది 75 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న మోదీ రిటైర్ అవుతారని కేజ్రీవాల్ చెప్పారు. ఒకవేళ మళ్లీ బీజేపీ గెలిస్తే వెంటనే యోగిని తప్పించేసి అమిత్ షాను ప్రధానిని చేస్తారని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీకి ఓటేసే వారు మోదీకి ఓటు వేయడం లేదని, అమిత్ షాకు ఓటు వేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత తాను ప్రజలు, ఎన్నికల నిపుణులతో మాట్లాడానని.. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. హర్యానా, రాజస్థాన్, బీహార్, యూపీ, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గుతున్నాయని తెలిపారు. ఎన్డీయేకు ఈసారి 220 – 230 సీట్లకు మించి రావని పేర్కొన్నారు. కాగా, ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే మమత బెనర్జీ, స్టాలిన్ సహా ప్రతిపక్ష నేతలు అందరినీ జైలుకు పంపిస్తారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ మంత్రులను జైలుకు పంపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మన దేశం చాలా పాతది. నియంతలు దేశాన్ని అధీనంలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడల్లా ప్రజలు వారిని పెకిలించేశారు. ఇవాళ మళ్లీ ఒక నియంత మన ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారు.’ అని ఆయన పేర్కొన్నారు.
75 ఏండ్ల వయస్సు తర్వాత మోదీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అగ్ర నేత అమిత్ షా స్పందించారు. బీజేపీ రాజ్యాంగంలో 75 ఏండ్లకు రిటైర్ అవ్వాలనే నిబంధన ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. మోదీనే తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని, భవిష్యత్తులోనూ దేశాన్ని నడిపిస్తారని, ఇందులో గందరగోళం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, కేజ్రీవాల్ సరైన అంశాన్ని లేవనెత్తారని, మోదీ చేసిన 75 ఏండ్ల నిబంధనపై మోదీనే స్పష్టత ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ పేర్కొన్నారు. మోదీ చేసిన నిబంధనలు ఇతర నేతలకు వర్తిస్తాయి కానీ మోదీకి వర్తించవని అమిత్ షా చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు.