న్యూఢిల్లీ: కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి ఆప్ ఒక సవాల్‌గా మారిందని, అందుకే తమ పార్టీని అణచివేసేందుకు, ఆప్ అగ్రనేతలను అరెస్టు చేయించి, జైలుకు పంపేందుకు ‘ఆపరేషన్ ఝాడు’ చేపట్టిందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ఆప్ ఎదుగుదలను చూసి బీజేపీ భయపడుతున్నదని, ఈ నేపథ్యంలో తమ పార్టీని నిర్వీర్యం చేసేందుకు పార్టీ నేతలను అరెస్టులు చేయిస్తున్నదని అన్నారు. తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఆయన ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి మార్చ్ చేపట్టారు. అనుమతి లేదంటూ మార్చ్‌ను పోలీసులు మధ్యలోనే అడ్డుకొన్నారు. పలువురు ఆప్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో కేజ్రీవాల్ అక్కడ పార్టీ నాయకులతో కలిసి బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం తిరిగి ఆప్ కార్యాలయానికి చేరుకొన్నారు.
మార్చ్ ప్రారంభానికి ముందు కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్తుల్లో ఇంకా పెద్ద సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నదని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. “వేగంగా ఎదుగుతున్న ఆప్‌ను చూసి ప్రధాని మోదీ ఆందోళన చెందుతున్నారు. అందుకే మన పార్టీని అణచివేసేందుకు ‘ఆపరేషన్ ఝాడు’ ప్రారంభించారు. రాబోవు రోజుల్లో మన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతోపాటు మన పార్టీ కార్యాలయాన్ని లాగేసుకొని రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తారు’ అని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారని, అయితే దర్యాప్తు సంస్థల సోదాల్లో 100 రూపాయలు కూడా గుర్తించలేకపోయారని అన్నారు.
మరోవైపు ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికేసులో ఢిల్లీ పోలీసులు ఆదివారం సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. సీసీటీవీ డిజిటల్ వీడియో రికార్డర్‌తోపాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు., మలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను ఢిల్లీలోని స్థానిక కోర్టు ఐదు రోజుల కస్టడీకి అప్పగించింది.
ఆప్ చేపట్టిన ఆందోళనలను ఉద్దేశించి స్వాతి మలివాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిర్భయకు న్యాయం చేయాలని ఒకప్పుడు పోరాటం చేసిన ఆప్ నేతలు.. ఇప్పుడు ఒక నిందితుడికి మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు.