Delhi Elections | న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలు తీరిక లేకుండా ప్రచారం చేశాయి. పుష్కరకాలంగా ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతూ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడుతున్న బీజేపీ ఈసారి ఆప్‌ను గద్దె దింపేందుకు గట్టిగానే కష్టపడుతున్నది. గత మూడు ఎన్నికల్లో ఓటముల తర్వాత ప్రభావాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి గత వైభవాన్ని పొందేందుకు శ్రమిస్తున్నది. దీంతో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొన్నది. దేశ రాజధాని కావడంతో ఢిల్లీ ఫలితాలు దేశ రాజకీయాల్లోనూ కీలకంగా మారనున్నన్నాయి.
2013 నుంచి ఢిల్లీ ఓటర్లు లోక్‌సభ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అసెంబ్లీకి వచ్చే సరికి కేజ్రీవాల్‌కే సీఎం కుర్చీని కట్టబెడుతున్నారు. ముఖ్యంగా ముస్లిం, దళిత, సిక్కు ఓటర్లలో, మురికివాడల్లో కేజ్రీవాల్‌కు ఆదరణ ఉన్నది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, నేతల అరెస్టులు, వలసలు, నగరంలో వాయు, నీటి కాలుష్యం, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు ఈసారి ఆమ్ ఆద్మీకి మైనస్‌గా మారాయి.
ఢిల్లీలో 1998 నుంచి బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. ఈసారి కచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఇందుకోసం అన్ని అస్ర్తాలనూ ఉపయోగిస్తున్నది. గతంలో విమర్శించిన ఆప్, కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చింది. ఉచితాలకు వ్యతిరేకం అంటూనే ఢిల్లీలో భారీగా హామీలు ప్రకటించింది.
2013 నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ క్రమంగా ప్రభావాన్ని కోల్పోయింది. పోయిన వైభవాన్ని తిరిగి పొందేందుకు ఈసారి కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నది. కొన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో దింపింది.
ఈసారి ఫలితాలు భిన్నంగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు ఎన్నికలల్లో కనిపించిన ఏకపక్ష ఫలితాలు ఈసారి ఉండకపొవచ్చని చెప్తున్నారు. కాంగ్రెస్ సాధించే ఓట్లను బట్టి ఆప్, బీజేపీ గెలుపోటములు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లిం, దళితులు గణనీయంగా ఉన్న 12 స్థానాల్లో ఆప్-కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు చెప్తున్నారు. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పొందేవి ఆప్ సంప్రదాయ ఓట్లనా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనా అనేది ఫలితాలను నిర్ణయించడంలో కీలకమని అంచనా వేస్తున్నారు.