Delhi Elections | న్యూఢిల్లీ, జనవరి 7: దేశ రాజధాని ఢిల్లీలో అసలైన ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గడ్డకట్టే చలిలోనూ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తున్నది. మరోసారి ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకునేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీలో పునరావృతం చేసి, 25 ఏండ్ల తర్వాత హస్తినను కైవసం చేసుకోవాలని బీజేపీ శ్రమిస్తున్నది. ప క్రితం కోల్పోయిన ప్రభను మళ్లి తిరిగి తెచ్చుకునేందుకు హస్తం పార్టీ సైతం కష్టపడుతున్నది. 70 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. కాంగ్రెస్ సైతం మంచి ఫలితాలను సాధించి, కింగ్‌మేకర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికలు కఠిన పరీక్షగా మారాయి. 2015, 2020 ఎన్నికల్లో 70 స్థానాలకు 67, 62 స్థానాలను గెలిచి అసాధారణ ఫలితాలను అందుకున్న ఆప్ ఈసారి మాత్రం అవినీతి ఆరోపణలు, నేతల అరెస్టులు, వలసలతో గడ్డు పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొంటున్నది.
స్లమ్‌లు, అనధికార కాలనీలు, మైనారిటీలు మెజారిటీగా ఉన్న, పేద వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీకి గట్టి పట్టుంది.
కొందరు నేతలు వలస వెళ్లినా పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.
ముస్లిం, సిక్కు, దళిత, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓటుబ్యాంకు ఆప్ బలం.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ చేతిలో బీజేపీ గట్టి ఎదురుదెబ్బ తిన్నది. వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఢిల్లీలోని మొత్తం 7 ఎంపీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నది. రాజధానిలో తమకు కంట్లో నలుసుగా మారిన ఆప్‌ను ఈసారి ఓడించాలని గట్టి పట్టుదలతో బీజేపీ ఉంది. ‘పరివర్తన్(మార్పు)’ నినాదంతో బీజేపీ ఈ ఎన్నికలకు వెళ్తున్నది.
పదేండ్ల క్రితం వరకు ఢిల్లీలో 15 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికలు, మూడు పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్కటంటే ఒక్క స్థానాన్నీ గెలుచుకోలేదు. ఈసారి ఎలాగైనా హస్తినలో పూర్వవైభవం సాధించాలని హస్తం పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తున్నది.