న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రంతా ఎడ తెరపిలేకుండా వర్షం కురిసింది. దీని వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణం వల్ల 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం ఉదయం గోడ కూలిపోయి ఇద్దరు చిన్నారులు సహా 8 మంది మరణించారు. జైతాపూర్లోని హరినగర్‌లో మోహన్ బాబా మందిరం సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గోడ కూలిపడడంతోదాన్ని ఆనుకుని ఉన్న ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.
మూడు అగ్నిమాపక శకటాలు, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల నుంచి నలుగురు పురుషులు , ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులను వెలికితీసినట్టు డీసీపీ(ఆగ్నేయ) హేమం త్ తివారీ తెలిపారు. పురాతన ఆలయం పక్కన కొందరు పేదలు చిన్న ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారని, రాత్రంతా ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షానికి గోడ కూలి ఒక ఇంటిపై పడిందని అదనపు డీసీపీ ఐశ్వర్య శర్మ తెలిపారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఇతరులను అక్కడి నుంచి తరలించినట్లు ఆమె చెప్పారు.