పనాజి: డాక్టర్ల సంఘాల నిరసనలతో ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే దిగివచ్చారు. సీనియర్ డాక్టర్‌తో తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు. (Goa Minister Apologises) వైద్య సేవలకు అంతరాయం కలిగించవద్దని ఆయన కోరారు. శనివారం గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ రుద్రేష్ కుట్టికర్పై అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులతో అహంకారంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయనను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే ప్రవర్తనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), గోవా అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ వంటి వైద్య సంఘాలు మండిపడ్డాయి. తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పడానికి 48 గంటల గడువు ఇచ్చాయి. సమ్మెను తీవ్రం చేస్తామని హెచ్చరించాయి. మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
మరోవైపు ఈ వివాదం ముదరడంతో సీఎం ప్రమోద్ సావంత్ జోక్యం చేసుకున్నారు. డాక్టర్ రుద్రేష్‌ను సస్పెండ్ చేయబోమని ఆదివారం హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి విశ్వజిత్ రాణే తన ప్రవర్తనపై సోమవారం క్షమాపణ చెప్పారు. ‘జీఎంసీహెచ్ సందర్శన సమయంలో నేను మాట్లాడిన కఠినమైన మాటలకు డాక్టర్ కుట్టికర్కు నా హృదయపూర్వక క్షమాపణలు. ఆ వేడి క్షణంలో నా వ్యక్తీకరణను నా భావోద్వేగాలు అధిగమించాయి. ఆ పరిస్థితిలో అలా ప్రవర్తించినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఏ వైద్యడ్ని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read: