న్యూఢిల్లీ, అక్టోబర్ 22: బీజేపీ (BJP) పాలనలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. డ్రైవర్గా ఉద్యోగం మానేసినందుకు ఓ 25 ఏళ్ల దళిత యువకుడిని అపహరించి చితకబాదిన కొందరు వ్యక్తులు అతని చేత బలవంతంగా మూత్రం (Urine) తాగించిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) భీండ్ జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో శివార్లలో జరిగిన మరో ఘటనలో దీపావళి పండుగ నాడు ఓ ఆలయం వద్ద మూత్ర విసర్జన చేసిన ఓ వృద్ధ దళితునిపై దాడి చేసిన గ్రామస్థులు అతని చేత అదే ప్రదేశంలో నేలను నాకించారు.
మధ్యప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం తన వద్ద డ్రైవర్గా పని మానేసినందుకు ఓ దళిత వ్యక్తిపై కోపం పెంచుకున్న ప్రధాన నిందితుడు అతడిని నిర్బంధించి దాడి చేయడమేగాక బలవంతంగా మూత్రం తాగించాడు. బాధితుడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడని, దర్యాప్తు కొనసాగుతోందని ఓ అధికారి మంగళవారం తెలిపారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం సోమవారం గ్వాలియర్లో ముగ్గురు వ్యక్తులు అతడిని అపహరించి భీండ్కు తీసుకెళ్లారు. అక్కడ అతడిని చితకబాది మూత్రం తాగించారు. బాధితుడిని అపహరించి కారులో తీసుకెళుతున్నపుడు ఒకసారి, అకుట్పురా గ్రామంలో గొలుసులతో కట్టేసి మరోసారి అతని చేత బలవంతంగా మూత్రం తాగించారని ఏఎస్పీ సంజీవ్ పాఠక్ మీడియాకు తెలిపారు.
ప్రధాన నిందితుడు సోనూ బారువా వద్ద డ్రైవర్గా పనిచేసిన బాధితుడు ఇటీవల ఉద్యోగం మానేశాడని ఆయన చెప్పారు. లక్నో శివార్లలో జరిగిన ఘటనలో కూడా నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత దళిత వృద్ధుడికి ఉబ్బసం వ్యాధి ఉందని, దగ్గినపుడు హఠాత్తుగా మూత్ర విసర్జన జరిగిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా వృద్ధుడి చేత నేలను నాకించలేదని, కేవలం తలను మాత్రం నేలను తాకించానని నిందితుడు వాదించాడు. ఈ ఘటన యూపీలో రాజకీయ వివాదాన్ని రాజేసింది. అధికార బీజేపీ రాష్ట్రంలో దళిత వ్యతిరేక వాతావరణాన్ని వ్యాప్తి చేస్తోందని విపక్షాలు ఆరోపించాయి.