భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఓ దళిత వ్యక్తిపై అమానుష దాడి జరిగింది. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేయడాన్ని ప్రశ్నించిన అతడిపై కొందరు వ్యక్తులు దాడిచేసి మూత్ర విసర్జన చేశారు. కత్ని జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈనెల 13న సాయంత్రం తన పొలానికి సమీపంలోని రామ్గర్హా కొండ నుంచి అక్రమంగా కంకరను తవ్వి తరలించడాన్ని తాను ప్రశ్నించినట్లు బాధితుడు రాజ్‌కుమార్ చౌదరి జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
సర్పంచ్, అతని అనుచరుల పర్యవేక్షణలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు చెప్పారు. దీన్ని ప్రశ్నించినందుకు తనను చితకబాది మూత్రవిసర్జన చేసి అవమానించారని ఆయన ఆరోపించారు. అయితే చౌదరి ఆరోపణలను సర్పంచ్ ఖండించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.