న్యూఢిల్లీ: మద్యం పార్టీలో కాళ్లు మర్దన చేయడానికి నిరాకరించాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు ఒక దళితుడి(33)ని చచ్చేలా బెల్ట్‌తో, ఇనుప కడ్డీతో కొట్టారని యూపీ పోలీసులు ఆదివారం తెలిపారు. బీజేపీ పాలిత యూపీలో ఈ దారుణం చోటుచేసుకున్నది. లలిత్పూర్ ఏఎస్పీ కాలు సింగ్ కథనం ప్రకారం.. లలిత్‌పూర్‌లోని వర్ణి జైన్ కళాశాల వెనుక ఉన్న రోడ్డుపై ఒక మనిషి పడి ఉన్నాడని పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. అతడిని రాజ్‌కుమార్ అలియాస్ ఛన్నుగా గుర్తించారు. అతడిని దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.
శనివారం రాత్రి సమ్యక్ రాజ్‌నాయక్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన మద్యం పార్టీకి రాజ్‌కుమార్ హాజరయ్యాడు. అక్కడ రాజ్ నాయక్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు మద్యం మత్తులో తమ కాళ్లు మసాజ్ చేయాలని రాజ్‌కుమార్‌ను అడిగారు. దానికి అతడు నిరాకరించడంతో అతడిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడు చనిపోయాడు. అతడి మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి అతడి శవాన్ని రోడ్డుపై పడేశారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు.