Crime news : అతడు బతుకుదెరువు కోసం దుబాయ్ (Dubai) కి వెళ్లి మేస్త్రీ (Mason) గా పనిచేస్తున్నాడు. ఆమె ఇండియాలోనే ఉంటూ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. అతడు దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చాడు. భార్యను పొడిచి చంపేశాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన ధర్మశీలం (30), మంజు (27) 2022 సెప్టెంబర్ వివాహం చేసుకున్నారు. అనంతరం ధర్మశీలం బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. మంజు తన తండ్రి పెరియస్వామితో కలిసి బెంగళూరులోనే ఉంటూ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పెళ్లయ్యి మూడేళ్లయినా వారికి ఇంకా సంతానం కలుగలేదు.
ఈ క్రమంలో ఇటీవల ధర్మశీలం బెంగళూరుకు తిరిగొచ్చాడు. ఆదివారం రాత్రి పెరియస్వామి బయటికి వెళ్లిన సమయంలో ధర్మశీలం తన భార్య మంజును పొడిచి చంపేశాడు. ఆపై అతను కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 9.30 గంటలకు పెరియస్వామి ఇంటికి తిరిగొచ్చే సరికి బిడ్డ, అల్లుడు ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ధర్మశీలం ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడనే వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తులో వివరాలు బయటికి వస్తాయని పోలీసులు తెలిపారు.