న్యూఢిల్లీ, డిసెంబర్ 26: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం మొదలైంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని సీపీఎం తిరస్కరించింది. ప్రజల మత విశ్వాసాలతో రాజకీయాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నది. తాను ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తెలిపారు. మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తూ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ కూడా ఆహ్వానాన్ని తిరస్కరించారు.
కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రాణ ప్రతిష్ఠాపనకు హాజరవుతారా లేదా అన్నదానిపైనా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ చౌదరికి, మాజీ ప్రధాని మన్మోహన్‌కు కూడా ఆహ్వానం అందింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా పార్టీ వైఖరి గురించి జనవరి 22న తెలుస్తుంది. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. చూద్దాం ఏం జరుగుతుందో’ అని అన్నారు.
సీపీఎం వైఖరిని బీజేపీ తప్పుపట్టింది. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతూ ‘ఆహ్వానాలు అందరికీ పంపాం. రాముడి పిలుపు అందుకున్న వాళ్లు మాత్రమే వస్తారు’ అని అన్నారు. సీపీఎం వైఖరిని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తీవ్రంగా విమర్శించారు. ‘తన సొంత పేరుపైన ద్వేషం ఉన్నందంటే.. అతడు కమ్యూనిస్ట్ మాత్రమే! ఆ ద్వేషం రాముడి మీదనా లేక ఒకరి పేరు మీదనా అనేది చెప్పాలి’ అని అన్నారు.