న్యూఢిల్లీ, డిసెంబర్ 31: తమతో చర్చలకు కేంద్రం అంగీకారం తెలిపితే తాను వైద్య సహాయం పొందడానికి సిద్ధమేనంటూ రైతుల డిమాండ్ల కోసం గత నెల రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నేత డల్లేవాల్ తెలియజేసినట్టు పంజాబ్ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
గతంలో దీనిపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుకు మరికొంత గడువు ఇవ్వాలని పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ కోరారు. దీక్షలో ఉన్న డల్లేవాల్ను బలవంతంగానైనా వైద్య చికిత్సకు తరలించాలంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఈ నెల 28న ఆదేశించిన క్రమంలో జస్టిస్‌లు సూర్యకాంత్, సుధాంశు ధులియాలతో కూడిన వెకేషన్ ధర్మాసనానికి పంజాబ్ సర్కార్ విజ్ఞప్తి చేసింది.
‘ప్రస్తుతానికి మా ఆజ్ఞల సమ్మతి కోసం మాత్రమే ఆందోళన చెందుతున్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో మీకు కొంత సమయం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాం’ అని పేర్కొన్న ధర్మాసనం కేసును జనవరి 2కు వాయిదా వేసింది.