లక్నో: భార్యాభర్తలు కలిసి కుటుంబంలోని ఆరుగురు సభ్యులను హత్య చేశారు. ఐదేళ్ల కిందట జరిగిన ఈ కేసుపై కోర్టు విచారణ జరిపింది. ఆ జంటను దోషులుగా నిర్ధారించడంతోపాటు వారికి మరణ శిక్ష విధించింది. (death penalty) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. 2020లో అజయ్ సింగ్ తన భార్య రూపా సింగ్తో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. తండ్రి అమర్ సింగ్, తల్లి రామ్ దులారి, సోదరుడు అరుణ్ సింగ్, వదిన రామ్ సఖి, వారి పిల్లలైన సౌరభ్, సారికలను కాల్చి చంపారు.
కాగా, అజయ్ సింగ్ సోదరి దుర్గావతి అలియాస్ గుడ్డీ సింగ్, లక్నోలోని బంత్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోదరుడు అజయ్ సింగ్ తమ తండ్రి నుంచి డబ్బులు డిమాండ్ చేసేవాడని తెలిపింది. భూమిని అమ్మిన డబ్బు మొత్తం అన్నా, వదినలకు తండ్రి ఇస్తాడేమోనని ఆందోళన చెందేవాడని చెప్పింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, అన్నావదినలు, వారి పిల్లలను హత్య చేశారని ఆరోపించింది. అజయ్ సింగ్, అతడి భార్య రూపా సింగ్, వారి మైనర్ కుమారుడు కలిసి దీనికి కుట్రపన్నినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల హత్యలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులైన అజయ్ సింగ్, అతడి భార్య రూపా సింగ్ను అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది. 31 డాక్యుమెంటరీ ఆధారాలను కోర్టుకు సమర్పించింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 16న భార్యాభర్తలైన అజయ్ సింగ్, అతడి భార్య రూపా సింగ్ను దోషులుగా లక్నో కోర్టు నిర్ధారించింది. శుక్రవారం శిక్షలు ఖారారు చేసిన కోర్టు ఆ జంటకు మరణ శిక్ష విధించింది.