న్యూఢిల్లీ, మే 3: టీఎంసీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలతోపాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఫలితం కీలకంగా మారిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనున్నది. మూడు అంచెల భద్రత వ్యవస్థ కలిగిన లెక్కింపు కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల్తో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలిసారిగా కౌంటింగ్ కేంద్రాల్లోకి అనధికార ప్రవేశాన్ని నివారించడానికి ఎన్నికల సంఘం ఈసీఐఎన్ఈటీ ద్వారా క్యూర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టింది. పశ్చిమ బెంగాల్‌లోని 293 అసెంబ్లీ స్థానాలకు 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నది.
ఈసారి ఊహించని రీతిలో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఫలితాల రోజు వరకు తీవ్ర వాగ్వాదం నెలకొంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ రెండూ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. రెండు దశల్లో జరిగిన పోలింగ్ ఏప్రిల్ 29న ముగిసింది. స్వాతంత్య్రం అనంతరం మొదటిసారి రికార్డు స్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదైంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా నియోజకవర్గంలో తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలను కారణంగా చూపుతూ ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఆ నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాలలో మే 21న రీపోలింగ్ జరగనున్నది.
ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నుంచి బలమైన సవాలును ఎదుర్కొన్న అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వరుసగా నాలుగోసారి గెలవాలని ఆశిస్తుండగా 2021 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సీపీఎం, కాంగ్రెస్ తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. హుమాయున్ కబీర్ నేతృత్వంలోని ఏజేయూపీ, అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం కూడా కొన్ని కీలక ప్రాంతాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇదివరకు మొత్తం 87 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ప్రకటించగా అ సంఖ్యను 77కు తగ్గించింది. 2021లో మొత్తం 107 కౌంటింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది.
అయితే ప్రస్తుత కౌంటింగ్ సందర్భంగా బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఈసీ ఏర్పాటు చేసింది. కౌంటింగ్ శాంతియుతంగా, పారదర్శకంగా, క్రమబద్ధంగా జరిగేలా చూసేందుకు సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశామని ఈసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 165 అదనపు కౌంటింగ్ పరిశీలకులను, 77 పోలీసు పరిశీలకులను ఈసీ నియమించింది. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు మినహా మిగతా వారికి మొబైల్ ఫోన్లను నిషేధించడం సహా లెక్కింపు కేంద్రాల వద్ద కఠినమైన ప్రవేశ నియంత్రణ చర్యలను ఈసీ ప్రవేశపెట్టింది.
అస్సాంలో హ్యాట్రిక్ సాధించగలమని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆశిస్తున్నది. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 722 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ధారించే ఈవీఎంలను 35 జిల్లాలోని 40 కౌంటింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం తెరవనున్నారు. కౌంటింగ్ కేంద్రాలు, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత కోసం 25 కంపెనీల (ఒక్కోదానిలో దాదాపు 100 మంది సిబ్బంది) సీఆర్పీఎఫ్ దళాలను ఈసీ నియమించింది. రాష్ట్రంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగగా 85.96 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖులలో బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఉన్నారు.
కేరళలో 2024 లోక్‌సభ ఎన్నికలు, ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలలో తన పనితీరుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)ను గద్దె దించాలని ఆశిస్తుండగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నది. ఎల్డీఎఫ్ ఓటమి పాలైతే 1960ల తర్వాత ఏ భారత రాష్ట్రంలోనూ వామపక్ష పార్టీలు అధికారంలో లేకుండాపోవడం ఇదే మొదటిసారి అవుతుంది. రాష్ట్రంలోని 140 సీట్ల కోసం మొత్తం 883 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 43 ప్రదేశాలలో 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పోటీలో లేనప్పటికీ 2021లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేరళలో తమ ఉనికిని విస్తరించుకోవడానికి ఈ ఎన్నికలను కీలకమైనవిగా భావిస్తున్నది.
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, దాని ప్రధాన ప్రత్యర్థి ఏఐఏడీఎంకేతోపాటు నటుడు-రాజకీయవేత్త విజయ్ నేతృత్వంలోని టీవీకే, తమిళ జాతీయవాది సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే వంటి కొత్త పార్టీల భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలిపోనున్నది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని డీఎంకే ఆశిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత నడుమ సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. ఈవీఎంల కోసం 234 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం అదనంగా 240 హాళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏఐఏడీఎంకే, బీజేపీ, ఐఎన్ఆర్సీ, ఎల్జేకే పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉండగా కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలు ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే ఒంటరిగా పోటీ చేసింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగగా రికార్డు స్థాయిలో 91.23 శాతం ఓట్లు పోలయ్యాయి. 2021 ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకుని కచ్చితమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ మరోసారి తన అదష్టాన్ని పరీక్షించుకుంటున్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా గెలుపును ఆశిస్తున్నది.
గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలోని 8 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఓట్ల లెక్కింపు జరగనున్నది. గోవాలోని పోండ, కర్ణాటకలోని బాగల్కోట్, దావణగెరె, నాగాలాండ్‌లోని కోరిదంగ్, త్రిపురలోని ధర్మనగర్, గుజరాత్‌లోని ఉమ్రీత్, మహారాష్ట్రలోని రహూరీ, బారామతి స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.