ప్రేమ పేరుతో ఇన్‌స్టాగ్రాంలో వేధిస్తున్న ఓ యువకుడిని శుక్రవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన చాపల ప్రవీణ్ మగ్గం పనులు చేస్తుంటాడు. ఇటీవల బాధితురాలు తన నానమ్మ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు ప్రవీణ్ పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్యన స్నేహం పెరిగింది. ఆ తర్వాత బాధితురాలు తిరిగి తన సొంతింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో ప్రవీణ్ ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలుపగా తిరస్కరించింది. దీంతో బాధితురాలిపై కోపం పెంచుకున్న ప్రవీణ్ ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫేక్ ఐడీని సృష్టించి, బాధితురాలికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఆమెతో చాటింగ్ చేశాడు. తనను పెండ్లి చేసుకోకపోతే ఆమెను చంపి.. తానూ చనిపోతానంటూ మెస్సేజ్‌లు పంపిస్తూ వేధించసాగాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు రాచకొండ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.