Karnataka | బెంగళూరు, జూలై 5: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పూర్తి చేసిన పలు పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయకపోవడంపై మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులను విడుదల చేయకుంటే ప్రస్తుతం జరుగుతున్న పనులన్నింటినీ ఆపేస్తామని రాష్ట్ర రాజధాని బెంగళూరు నగర పాలక సంస్థ(బీబీఎంపీ) పరిధిలోని కాంట్రాక్టర్లు తాజాగా హెచ్చరికలు చేశారు.
నగర పాలక సంస్థకు ఆదాయం వస్తున్నా గత రెండేండ్లలో పూర్తి చేసిన పలు పనులకు సంబంధించిన రూ.1,500 కోట్ల మేర బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదలలో జాప్యంతో తమ ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు అభ్యర్థించినా..
కాంట్రాక్టర్ల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మంజునాథ్ మాట్లాడుతూ బీబీఎంపీ చీఫ్ కమిషనర్గా తుషార్ గిరినాథ్ వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టర్లు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. బిల్లుల విడుదలకు సంబంధించి ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్లు తీవ్ర ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. గత రెండేండ్లలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించి రూ.1,500 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఎలాంటి కారణం లేకుండా బీబీఎంపీ యంత్రాంగం 25 శాతం బిల్లులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తున్నదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
కాంట్రాక్టర్ల పరిస్థితిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పరస్పరం దుమ్మెత్తి పోసుకొన్నాయి. బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద నిధులే లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి అన్నారు. గత బీజేపీ ప్రభుత్వ ‘40% కమీషన్’ స్కామ్ వల్లనే బిల్లుల విడుదల జాప్యం నెలకొన్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ విమర్శించారు. బకాయిలు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు.