న్య్రూఢిల్లీ, డిసెంబర్ 16: కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన డాటా భద్రతా బిల్లు-2022కి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియపై 70 మందికిపైగా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అప్రజాస్వామికంగా ఉన్నదని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యులకు వారు తాజాగా లేఖ రాశారు. మైగవ్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశం కల్పించారని ఆరోపించారు. ప్రజాభిప్రాయాలను పబ్లిక్ డొమైన్లో ఉంచకపోవడం, అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా లేదా అని తెలుపకపోవడం సంప్రదింపుల ప్రక్రియకు వ్యతిరేకమని విమర్శించారు. డాటా భద్రతా బిల్లు దేశ ప్రజలందరిపైనా ప్రభావం చూపుతుందని స్పష్టంచేశారు. బిల్లులో సమాచారహక్కు చట్టంలోని సెక్షన్ 8(ఐ) (జే)కు ప్రతిపాదించిన సవరణలను కూడా వారు వ్యతిరేకించారు. లేఖపై సంతకం చేసిన వారిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్, సీనియర్ జర్నలిస్ట్ పీ సాయినాథ్ ఉన్నారు.